Lemon Juice : నిమ్మకాయలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నిమ్మకాయలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ఇక వేసవిలో నిమ్మరసం శరీర వేడిమి నుంచి ఉపశమనం కలుగుజేస్తుంది. నిమ్మకాయలో ఐరన్, విటమిన్లు సి, బి, ఇ, క్యాల్షియం తదితర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాకుండా నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి నీరసం రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా పొట్ట సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
సాధారణంగా నిమ్మరసం తయారు చేసేటప్పుడు సాధారణ చల్లని నీటిని కలుపుకుంటాం. చాలా మంది ఈ విధంగా నిమ్మ రసం తాగడానికి ఇష్టపడతారు. సాధారణమైన నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగడం కన్నా, గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు నిమ్మకాయ రసం తయారీ విధానం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి. మరిగిన ఈ నీటిని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో ఒక నిమ్మకాయని రసం తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న ఈ రసంలోనే రెండు చెంచాల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి రోజూ ఈ విధంగా నిమ్మరసాన్ని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
నిమ్మకాయలలో విటమిన్ బి, సి, భాస్వరం వంటి పోషకాలు ఉండటంవల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి. దీని ద్వారా మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అంది అలసటను తగ్గించి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా ఈ విధంగా గోరువెచ్చని నిమ్మకాయ రసాన్ని తాగడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గి బరువు నియంత్రణలోకి వస్తుంది.