Buffalo Vs Cow Milk : పాలు సంపూర్ణ పౌష్టికాహారం. అందులో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. దీంతో మనకు సంపూర్ణ పోషణ అందుతుంది. అందుకే పాలను సంపూర్ణ పౌష్టికాహారం అంటారు. పాలలో ఉండే విటమిన్ డి, కాల్షియం మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు. వీటి వల్ల ఎముకలు బలంగా, దృఢంగా మారడమే కాదు, శరీర పెరుగుదల సరిగ్గా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే పాలు అనగానే మనకు రెండు రకాల పాలు గుర్తుకు వస్తాయి, అవి ఒకటి గేదె పాలు. రెండు ఆవు పాలు. కొందరు ఆవు పాలను తాగేందుకు ఇష్టం చూపిస్తే కొందరు గేదె పాలు మాత్రమే తాగుతారు. మరి నిజానికి మనకు ఈ రెండింటిలో ఏ పాలు బెటర్..? ఎలాంటి శరీర తత్వం ఉన్నవారు ఏ పాలు తాగితే మంచిది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గేదె పాలకు, ఆవు పాలకు పలు ముఖ్యమైన తేడాలు ఉంటాయి. అవేమిటంటే.. ఆవు పాలు చాలా లైట్‌గా ఉంటాయి. తక్కువ ఫ్యాట్‌ను కలిగి ఉంటాయి. త్వరగా జీర్ణమవుతాయి. అందుకే వాటిని శిశువులకు తాగిస్తారు. ఇక గేదె పాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గేదె పాలను ఎక్కువగా పన్నీర్, ఖీర్, కుల్ఫీ, పెరుగు, నెయ్యి తయారీలో వాడుతారు. ఆవు పాలతో రసగుల్లా, రసమలై వంటివి చేస్తారు. ఇక ఆవు పాలు కేవలం 1, 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. గేదె పాలను ఎన్ని రోజులైనా నిల్వ ఉంచవచ్చు.
గేదె పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువే. అందువల్లే గేదె పాలతో మనకు లభించే క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆవు పాలలో నీరు ఎక్కువగా ఉంటుంది. 90 శాతం నీటిని ఆవు పాలు కలిగి ఉంటాయి. దీంతో ఆవు పాల ద్వారా మనకు లభించే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గేదె పాలలో కాల్షియం, పాస్ఫరస్, మెగ్నిషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఆవు పాలలో ఇవి కొంత తక్కువగా ఉంటాయి. ఇక మరి ఈ రెండు రకాల పాలలో ఏవి తాగితే బెటర్ అంటే..
అధిక బరువు ఉన్నవారు ఆవు పాలను తాగడం బెటర్. ఎందుకంటే క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. దీనికి తోడు పోషకాలు కూడా అందుతాయి. కనుక అధిక బరువును తగ్గించుకోవచ్చు. సన్నగా ఉన్నవారు, జీర్ణ శక్తి అధికంగా ఉన్నవారు నిక్షేపంగా గేదె పాలు తాగవచ్చు. వ్యాయామం రోజూ చేసేవారు కూడా గేదె పాలను తాగవచ్చు. జీర్ణశక్తి అంతగా లేని వారు ఆవు పాలను తాగితే బెటర్. దాంతో మంచి పోషకాలు అందుతాయి. ఇలా వివిధ రకాల సమస్యలు ఉన్నవారు తమ శరీర తత్వాలకు అనుగుణంగా ఆవు పాలు లేదా గేదె పాలను తాగాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.