ఎంతో మంది ఉదయాన్నే హుషారుగా లేస్తూ తమ పనులు చకచకా చేసుకుందాం అనుకుంటారు. కానీ లేవడంతోనే విపరీతమైన నీరసంతో ఉన్నచోటే చతికల పడిపోతుంటారు. తమ పనులు తాము చేసుకోడానికి కూడా ఓపిక ఉండదు. అలాంటివారు అలసట, నీరసం తగ్గించుకొని రోజు మొత్తం హుషారుగా పరిగెత్తాలి అంటే కచ్చితంగా మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. మరి ఇలా నీరసం, అలసటతో బాధపడుతున్నవారికి తక్షణమే శక్తిని ఇచ్చే సూపర్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక పాత్రలో ఐదు అంజీర్, ఐదు బాదం పప్పులు, పది ఎండు ద్రాక్షలు, ఒక కప్పు నీటిని పోసి రాత్రి మొత్తం నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం, అంజీర్, ఎండు ద్రాక్షలను మిక్సీలో వేసి బాగా పేస్ట్ లా చేసుకోవాలి. బాగా కాచిన ఒక గ్లాసు వేడి పాలలో ఈ పేస్ట్ ను స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం రుచి కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూను బెల్లం తురుము, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే మీ శరీరానికి కావల్సిన పోషకవిలువలు గల సూపర్ డ్రింక్ రెడీ అయిపోయింది.
ఈ డ్రింక్ లో పోషక విలువలు అధికంగా ఉండటం వల్ల నీరసం పరార్ అయిపోయి రోజు మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అంతేకాకుండా ఈ సూపర్ డ్రింక్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మేలు చేస్తుంది. దీనిలోని అధిక ఫైబర్ వల్ల కొవ్వును కరిగిస్తుంది. రక్తహీనత సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఎంతో ప్రయోజనం కలుగజేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సూపర్ డ్రింక్ ను కనీసం వారానికి రెండు సార్లైనా సేవిస్తూ అలసట, నీరసాన్ని దూరం చేసుకోండి.